తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు ను సీఎం ఆదేశించారు.
రైతుబంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు గాను 7,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.
రైతుబంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది.
Check out Newly Launched OnePlus 12R Features and Pricing on Amazon
ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతు బీమాతో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా దేశ వ్యవసాయరంగ నమూనా మార్పుకు (Paradigm Shift) కు దారితీసింది. సీఎం శ్రీ కేసిఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి.
దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పలు మార్గాల నుండి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నది.
కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతుబంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం శ్రీ కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.